పయనించు నీలి మేఘం
గేయాల్లో పాండిత్యంతో పాటు వాస్తవికత ఉంటే అద్భుతంగా ఉంటుంది. కృష్ణశాస్త్రివంటి వారు ఎలాగైనా అరుదే. ఎవరో కవి రాసిన ఈ పాటని కుమారి ముచ్చట పడి పాడతానంటే కాదనలేకపోయాం. ఇది పిల్లల పాటనా, అంటే కాదేమో మరి. అయినా ’కుమారి పాడింది’ అని వింటే బానే ఉండచ్చు- మీరూ విని చెప్పండి.
వానాకాలంలో కోయిలలు నిజానికి పాడవు. పచ్చని చేలుంటాయి, కాని విచ్చిన పూలుండవు వానల్లో. మల్లెతీగలు పచ్చగానే ఉంటాయి, కానీ మరీ అంత రమ్మనవు. ఇక ’కాష’ ’చిత్రకూట రాగం’ ’ఇల్లయేరి తాళము’ ఇవేమిటో మాకూ అర్ధం కాలేదు. విజ్ఞులకు ఇంకా అనేక తప్పులు దొరుకుతాయి ఇందులో వెతికితే. అయినా ఇవన్నీ గళ మాధురిలో కొట్టుకుపోతాయని మా విశ్వాసం. పదును పెడితే ఈ స్వరం మరింత చక్కనౌతుందనటంలో సందేహం లేదు.
గానం: కుమారి, ఇంటర్మీడియట్, చెన్నేకొత్తపల్లి.
డప్పు: సతీష్, ఎనిమిదో తరగతి, ప్రకృతి బడి, చెన్నేకొత్తపల్లి.
పయనించు నీలి మేఘం
పాడింది వాన రాగం
|పయనించు|
పచ్చని చేలలో విచ్చిన పూలలో
మెరిసింది ఆమని కురిసింది ప్రేమని
|పయనించు|
పూలపైన తుమ్మెదొచ్చి వాలె తేనె కోసమె
మావిపూవు ఇంటిలోన కోయిలమ్మ వాలెనె
మల్లెతీగ రమ్మనె మనసు విప్పి పొమ్మనె
పల్లెపడుచు పైటలోన పిల్లగాలి ఝుమ్మనే
|పయనించు|
మల్లెపూల సోకులన్ని సిగ్గుపడే తోటలో
సన్నజాజి గండుమల్లె సాగిపోయె కాషలో
చిత్రకూట రాగము ఇల్లయేరి తాలము
పట్టరాని సంబరాన పరుగుతీసె కాలము
|పయనించు|