వన్నెల చిన్నెల పాపలము
కమ్మని పలుకుల చిలుకలము
తీయని ముద్దుల మూటలము
తరగని మీగడ తరగలము

చదువు సంధ్యలు మా హక్కు
మనో వికాసం మా హక్కు
తిండీ‌బట్టలు మా హక్కు
దేహారోగ్యం మాహక్కు
అది మా హక్కు ఇది మా హక్కు
అని పెద్దలు అంటుంటారు
ఆందోళన చేస్తుంటారు
మా హక్కుల మాటేమంటారు?
"వన్నెల చిన్నెల "

మాలో ఝాన్సీలున్నారు
మాలో‌రుద్రమలున్నారు
మాలో రాయలలున్నారు
మాలో గాంధీలున్నారు
మాలో సుభాషులున్నారు
మాలో జవహరులున్నారు
ఎవరిలో ఎవరు ఉన్నారో
మీరే పెద్దలు వెతకండి
"వన్నెల చిన్నెల"

కార్యశూరులు కన్నమ దాసులు
బాల చంద్రులు బొబ్బిలి వీరులు
తానాజీలు శివాజీలు అప్పాజీలు రాజాజీలు
విశ్వకవీంద్రులు విశ్వేశ్వరయ్యలు
విశ్వమందు శాశ్వతులు
వీరందరు బాలలె ఒకనాడు
వారిలా అవుతాం మరునాడు
"వన్నెల చిన్నెల"