అందాల బాల

అందాల బాలా    
ఆడుకోవేల?    
జిజ్జిపోయేవేళ     
జొ జో ఉయ్యాల     
అమ్మపాడే జోల     
కమ్మగుంది చాలా! 



బంగరు బొమ్మ

బంగరు బొమ్మ మా పాప    
మాపాప నవ్వులు రత్నాలు    
మాపాప పలుకులు ముత్యాలు    
మాపాప నడకల్లు నాట్యాలు    
మాపాప ముంగురులు తుమ్మెదలు     
మా పాప బుగ్గలు రోజాలు!     



రంగుల రాట్నం!

అదిగో అదిగో అందాల పట్నం    
పట్నంలోన బాలవిహార్    
బాలవిహార్లో రంగులరాట్నం        
రాట్నం చుట్టూ బచ్చెన గుర్రాల్       
గుర్రాలెక్కీ ట్స్చ్ ట్స్చ్ ట్స్చ్ ట్స్చ్     
గుర్రాలెక్కీ గిరగిర తిరుగుతు     
సవారీ చేద్దాం చలో చలో!     



**ఏమంది? **

కుక్కపిల్ల ఏమంది?    
చక్కని చుక్కా రమ్మంది     
పిల్లి కూన ఏమంది?     
మల్లె మొగ్గ తెమ్మంది     
మేకపిల్ల ఏమంది?     
మెడలో దండ ఇమ్మంది    
ఆవుదూడ ఏమంది?    
అందాల బొమ్మా లెమ్మంది!