మా ఊరు పుట్టినప్పటినుంచి కోడికూతల ప్రవాహమే!

**కొండమీద పోతున్న నదిని లాగి నేల సేద్యానికి దారి తీసిందో ఇంద్రకోడి (ఇంద్రుడు) **

పాల గంపలోనుంచి తొంగి చూసి ధర్మగీత గీసిందో నల్లకోడి (విష్ణుమూర్తి)

**అహంకరించి కంగుతిన్న ఓ కోపిష్టికోడి జ్ఞానమంత్రం పంచి ఇచ్చింది (విశ్వామిత్రుడు) **

పుట్టలో మునిగి లేచిన ఓ వేటకోడి, రాలిన పిట్టపై జాలిగొంది- సిసలు మనిషి కథను వేకువ కావ్యం‌చేసింది (వాల్మీకి)

**సంసారాన్ని, రాజ్యాన్ని విసిరేసి కోరికల చరమ గతి గుట్టు విప్పిందో చెట్టుకింద కన్ను తెరిచిన కోడి (గౌతమ బుద్ధుడు) **

పందెం గెల్చిన మరో రాచకోడి దారి ప్రక్కన శాంతి వృక్షమైంది (అశోకుడు)

**మా ఊరి కోడే శూన్యంతో అంకెలను సంకెలచేసి అనంతాన్ని దర్శింపజేసింది-లెక్కలకు రెక్కలిచ్చింది (ఆర్య భట్ట) **

జంతువులతో‌ నీతి కథలు పలికించిందొక చతుర కోడి (విష్ణుశర్మ)

**పసిప్రాయంలోనే మనసు గెల్చిన కాలడి కోడి మాయ సౌందర్యం అంతరాల్ని చీల్చి అంతా ఆ 'ఒక్క' పదార్థమేనని నిగ్గు తేల్చింది (ఆది శంకరాచార్య) **

అవమానాన్ని దిగమ్రింగిన మరోకోడి పరాయి పాలనపై సాత్వికోద్యమంతో కన్నెర్ర చేసింది (మహాత్మా గాంధీ)

**ఎక్కడినుంచో వచ్చిన ఓ తల్లి కోడి ఇక్కడి గాయాలకు మానవత్వపు కట్లు కట్టింది (మదర్ థెరెసా) **

మా ఊరి ప్రతి మలుపులో ఏదో ఒక కోడి- పిల్ల కోళ్ళకు తత్వ బీజాలను కొసరి కొసరి తినిపిస్తూనే ఉంటుంది

**ఒక్కో కోడి కూసినప్పుడల్లా మా ఊర్లో ఒక్కో ఉదయం పూస్తుంటుంది **

**మా ఊరి పేరు భరత జాతి- **

మా కోడి కూత పేరు పురోగతి