** లోగుట్టు! **
డాక్టర్: మీరు బయట తినకండి. లేకపోతే ఎలర్జీ తగ్గదు.
రామారావు: అలాగేనండి. ఇంట్లోనే తింటాను. బయట కొనుక్కున్నా సరే- ఇంటికి తెచ్చుకునే తింటాను.
** నిరసన! **
తండ్రి: అదేమిట్రా! నుంచుని తింటున్నావెందుకు?!
కొడుకు: భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నానని మీరు తిట్టారుగా? అందుకే!
** ఆధునిక విజ్ఞానం! **
టీచర్: బిట్టూ! 16 వ శతాబ్దం నాటి రాజుల గురించి నీకేమైనా తెలుసా?
బిట్టూ: తెలుసు టీచర్
టీచర్: గుడ్..ఎం తెలుసో చెప్పు?
బిట్టూ: వాళ్ళంతా చనిపోయారు టీచర్!
** మూల కారణం! **
టీచర్: రామూ! భూకంపాలు ఎప్పుడు వస్తాయి?
రాము: భూమి సూర్యుడి చుట్టూ తిరిగి తిరిగి, కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు టీచర్!
** జాగ్రత్త పరుడు **
భార్య: ఏం చేస్తున్నారక్కడ?
వెంగళప్ప: మొక్కలకి నీళ్ళు పోస్తున్నాను
భార్య: వర్షం పడుతోందిగా!
వెంగళప్ప: ఫర్వాలేదు! గొడుగు వేసుకొనే పోస్తున్నా...!
** పరిశుభ్రమైన హోటల్! **
సర్వర్ (నవ్వుతూ) : మా హోటల్ హల్వా ఎలా ఉంది సర్?!
రవి (నవ్వుతూ) : మీకు ప్రతీదీ శుభ్రంగా ఉంచడం అలవాటు కదా?
సర్వర్ (ఆశ్చర్యంగా) : అవునండి! మీకెలా తెలిసింది?!
రవి : ఏం లేదు.. ఏలకుల వాసన కంటే విమ్ సబ్బు వాసనే ఎక్కువ వస్తుంటేను!
** రహస్యం! **
శీనా: ఉత్తరం మీద చిరునామా రాయకుండానే పోస్ట్‌బాక్స్‌లో వేశావేంట్రా?!
రాము: ఎవరికీ తెలీకుండా రహస్యంగా పంపుతున్న ఉత్తరంరా, అది!!
** చిన్న తేడా! **
రవి: అలారానికి, పలారానికి ఏమైనా సంబంధం ఉందా?
శశి: ఉంది. కోడిపుంజు కూస్తే అలారం; కోస్తే పలారం!
** ఇద్దరూ వేలే! **
తల్లి (ప్రైవేటు కాలేజీ కరస్పాండెంటు తో) : మావాడి పేరు ఏకలవ్యుడు అని పెట్టాల్సింది సర్.
కరస్పాండెంట్: అదేమి?
తల్లి: ఆయన వేలు కోసి చదువుకున్నాడు; మావాడు వేలు పోసి చదువుకుంటున్నాడు..
** పీడ విరగడ! **
భార్య: దోమలు బాగా కుడుతున్నాయండి. ఏ ఆలౌటో వెలిగించుకోవాలి.
పిసినారి వెంగళ్: వెలిగించుకుంటే ఊరికే గాల్లో కలిసిపోతుంది. త్రాగేస్తే సరి! ఆపైన మనల్ని కుట్టిన దోమలన్నీ చచ్చి ఊరుకుంటాయి.
** వాస్తవం! **
జర్నలిస్టు : మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన బుక్స్ ఏవి?
నాయకుడు : ఓ నాలుగైదు ఉంటాయి. అన్నీ బ్యాంకు వాళ్ళిచ్చిన చెక్కు బుక్కులే.
** పోయే కాలం **
క్విజ్ మాస్టారు : గడియారం పదమూడు గంటలు కొట్టిందంటే, అది ఏమి సమయం?
సోము : రిపేర్ సమయం సర్!
** గౌరవం! **
అల్లరి చిల్లర కొడుకు : డాడీ! పార్టీకి కార్ తీసుకెళ్తాను డాడీ!
తండ్రి : ఎందుకురా నాన్నా?!
అల్లరి చిల్లర కొడుకు : ఎంత వాహనంలో పార్టీకెళ్తే అంత గౌరవం డాడ్! పది లక్షల కారు! సూపర్!
తండ్రి : బస్సయితే యాభై లక్షలు! ఇదిగో బస్సు టిక్కెట్టు డబ్బులు పది రూపాయలు పట్టుకెళ్ళు!
** దయ! **
డింగరి : వంద రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూ ఎందుకుంటాడు?
తింగరి: ఏడుస్తుంటే మరి నోటంతా తడయిపోతుంది గదా, అందుకని!
** ఎక్కువైన తెలివి! **
జడ్జిగారు : హత్య జరిగిన కత్తి పైన నీ వేలిముద్రలు ఉన్నాయి కాబట్టి నువ్వు నేరస్తుడివి అని నిర్థారిస్తున్నాను.
ముద్దాయి : నేను M.A చదివాను సార్! వేలుముద్రల వాడిని కాదు! మీ తీర్పుని సరిచూసుకోండి!
** నోరెందుకు మెదపరు? **
అమ్మ: ఫెవికాల్ ట్యూబ్ ఏదంటే మీ నాన్న నోరు విప్పట్లేదేంరా రవీ?
రవి: పొద్దున్నే నన్ను టూత్ పేస్ట్ అడిగారమ్మా. నేను ఫెవికాల్ తెచ్చిచ్చాననుకుంటా!
** పొడుపు కథలు **
- ఎముక లేనిది, నిచ్చెన ఎక్కేది
- ఊళ్ళో లేని మండలం, చేతిలోని మండలం
- ఊరంతా ఒకటే పందిరి!
- ఏడవక ఏడ్చును, నవ్వక నవ్వును. ఎవరు?
- ఒక పోలీసు, రెండు టోపీలు. ఏంటది?
- ఇల్లంతా వెలుగు, బల్ల క్రింద చీకటి
- ఒక ఇంటికి రెండు దారులు!
- ఏ రాయీ వద్దన్నా ఆ రాయి కావాలి అందరికీ!
- ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది!
- కన్నులున్న చిన్నది, కడలియందు జీవించు!
** పొడుపు కథలకు జవాబులు **
- పేను
- కమండలం
- ఆకాశం
- నటుడు
- బఠానీ గింజ
- దీపం
- ముక్కు
- ఉప్పురాయి
- అద్దం
- చేప
(పొడుపు కథల సేకరణ సౌజన్యం : డా.పత్తిపాక మోహన్, “పిల్లలకోసం పొడుపు కథలు”)
